AP

చంద్రబాబుతో ఒకేరోజు రెండుసార్లు పవన్ కళ్యాణ్ భేటీ..సుదీర్ఘ చర్చ..

తెలుగదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలూ సమావేశమయ్యారు. అంతకుముందు ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తులో భాగంగా మరోసారి భేటీ అయినట్లు తెలుస్తోంది.

 

అయితే, ఒకరేజో రెండు సార్లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నేతలు, శ్రేణులు ఎదురుచూస్తోన్న వేళ ఈ భేటీలో టీడీపీ-జనసేన మధ్య సీట్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఎక్కడ ఎవరిని బరిలో నిలపాలనే అంశంపై ఈ భేటీలో నేతలిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రెండో భేటీలో సుమారు 45 నిమిషాలపాటు చర్చలు జరిపారు.

 

పొత్తుల కారణంగా రెండు పార్టీల్లో సీట్లు కోల్పోతున్న ఆశావహులకు ఆయా పార్టీల అధిష్టానం నచ్చజెప్పి.. వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆపై సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉంది. పొత్తు కారణంగా కొందరు నేతలకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉందని, అయితే, వారికి ప్రాధాన్యత మాత్రం కల్పించడం జరగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

 

సోమవారం మధమ్యాహ్నం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి తన సొంత వాహనంలో తానే నడుపుతూ పవన్‌ కళ్యాణ్ ఒక్కరే చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయన వెళ్లిన 15 నిమిషాల తర్వాత ఆయన భద్రతా వాహనశ్రేణి విడిగా అక్కడికి చేరుకుంది. తన నివాసానికి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌కు చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు.

 

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పవన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ మాత్రమే భేటీలో పాల్గొన్నారు. కాగా, రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ఇప్పటికే ప్రకటించగా, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అదే స్థానం నుంచి తిరిగి జనసేన అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.