National

ఎల్ కే అద్వానికి భారతరత్న..

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి ఇవాళ కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించింది. వృద్ధాప్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్న ఆయనకు ఇవాళ భారత రత్న పురస్కారం అందిస్తున్నట్లు ప్రధాని మోడీ ఫోన్ చేసి తెలిపారు. అనంతరం ఎక్స్ లో ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టారు. దీంతో అద్వానీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు భారత రత్న అవార్డు ప్రకటించడంపై అద్వానీ కూడా స్పందించారు.

 

తనకు కేంద్రం ప్రకటించిన భారతరత్న అవార్డును వినయం, కృతజ్ఞతతో అంగీకరిస్తున్నట్లు లాల్ కృష్ణ అద్వానీ ఇవాళ తెలిపారు. అలాగే ఈ జీవితం తనది కాదని, నా దేశం కోసమే నా జీవితం అని ఆయన పేర్కొన్నారు. 14 ఏళ్ల వయస్సుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో స్వచ్ఛంద సేవకుడిగా చేరినప్పటి నుంచి తన జీవితంలో తనకు ఏ పని అప్పగించినా దేశానికి సేవలో అంకిత భావంతో, నిస్వార్ధంగా ఉండాలని కోరుకున్నట్లు అద్వానీ తెలిపారు.

 

ఈ జీవితం నాది కాదు- నా జీవితం నా దేశం కోసమే అనే నినాదం తనను ప్రేరేపించినట్లు అద్వానీ ఓ ప్రకటనలో తెలిపారు.పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి తనతో సన్నిహితంగా పనిచేసిన ఘనత కలిగిన ఇద్దరు వ్యక్తుల పట్ల అద్వానీ తన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు భారతరత్న ప్రకటన తర్వాత ప్రధాని మోడీ సహా పలువురు బీజేపీ నేతలు, మంత్రులు, అభిమానులు అద్వానీకి శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.