National

మధ్యప్రదేశ్ ఎన్నికలు: ఎట్టకేలకు ముఖ్యమంత్రికి టికెట్ వచ్చింది, 57 మందితో జాబితా రిలీజ్

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అధికార భారతీయ జనతా పార్టీ 57 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను సోమవారం విడుదల చేసింది.

ఇప్పటి వరకు సీటు కేటాయించకపోవడంతో ఉత్కంఠ కొనసాగిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం.

సంప్రదాయంగా వస్తున్న బుధ్నీ సీటు నుంచే శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారు. మొదట సీఎం శివరాజ్ సింగ్‌కు మూడు జాబితాల్లోనూ టికెట్ కేటాయించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిందని ప్రచారం జరగడంతో ఆయనకు టికెట్ కేటాయిస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

ఈ నేపథ్యంలో విడుదలైన 4వ జాబితాలో శివరాజ్‌కు టికెట్ కేటాయించడంతో అన్ని అనుమానాలకు చెక్ పడినట్లయింది. అయితే, సీఎం అభ్యర్థి పేరు చెప్పకుండానే బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుండటం గమనార్హం. మరోవైపు, దాటియా నుంచి రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పోటీ చేయనున్నారు. రెహ్లీ నుంచి గోపాల్ భార్గవ, నరేలా నుంచి విశ్వాస్ సరాంగ్, సన్వార్ నియోజకవర్గం నుంచి తులసీరాం సిలావత్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.

మధ్యప్రదేశ్ తోపాటు దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే, మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ముందుగానే ప్రకటించింది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 39 మంది అభ్యర్థుల పేర్లతో ఆగస్టు 17న బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది. రెండవ జాబితా సెప్టెంబర్ 25న విడుదలైంది. ఈ జాబితాలో ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల సహాయ మంత్రి (MoS) ప్రహ్లాద్ సింగ్ పటేల్, గ్రామీణాభివృద్ధి మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులత్సే తోపాటు మరో నలుగురు లోక్‌సభ ఎంపీలు ఉన్నారు.