AP

తోడేళ్ల మధ్య జగన్ ఒంటరే-కానీ జన హృదయాల్లో ఉన్నా-ఏలూరు సభలో గర్జన..

ఏలూరులో ఇవాళ నిర్వహించిన వైసీపీ సిద్ధం 2 సభలో సీఎం జగన్ మీరు సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించారు. మరో చారిత్రక విజయం అందుకునేందుకు సిద్ధమా.. ఇంటింటి భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా… పేదల భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా..దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి సిద్ధమా.. అని వైసీపీ శ్రేణుల్ని ప్రశ్నించారు. రామాయణం, భారతంలో విలన్లంతా ఎల్లో మీడియా, విపక్షాల రూపంలో ఇక్కడే ఉన్నారంటూ జగన్ గుర్తుచేశారు. ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కానీ కోట్ల మంది హృదయాల్లో ఉన్నాడన్నారు.

 

విపక్షాల సైన్యం పొత్తులు, ఎల్లో మీడియా అయితే తన సైన్యం దేవుడు, ప్రజలే అని జగన్ తెలిపారు. ఇక్కడ కనిపిస్తున్న జనమే తన నమ్మకం, బలం అన్నారు. వచ్చే పోరులో మీరు కృష్ణుడైతే.. నేను అర్జునుడిని అన్నారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమం, మంచిపై విపక్షాలు దాడి చేస్తున్నాయని, పేదవాడి సంక్షేమం మీద, రాబోయే తరం విద్యావిధానాలపై దాడి చేస్తున్నారన్నారు. గ్రామాల్లో మార్పు కనిపిస్తోందని, తమ సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యమన్నారు. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లు గెల్చుకోవడమే తమ లక్ష్యమన్నారు. తన మాటల్ని ప్రతీ కుటుంబానికీ చేరవేయాలని కోరారు.

 

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశారో అడగాలని జగన్ సూచించారు. చంద్రబాబు, జగన్ పాలనకు మధ్య తేడాను గమనించాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన పథకాలు ఏంటో అడగాలన్నారు. చంద్రబాబు హయాంలో అక్క చెల్లెళ్ల ఖాతాల్లో రూపాయి అయినా పడిందా అని అడిగారు. చంద్రబాబు 10 శాతం హామీలైనా నెరవేర్చాడా అని అడిగారు. చంద్రబాబు పాలనకూ, జగన్ 57 నెలల పాలనకూ తేడా గమనించాలన్నారు.