AP

బ్లాక్‌మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తారా – టీడీపీ నేతలపై పోతిన ఆగ్రహం..!!

ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల కోసం టీడీపీ, జనసేన మధ్య పంచాయితీలు మొదలయ్యాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్ల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ తన పార్టీకి రెండు సీట్లు ప్రకటించారు. ఇక, ఇప్పుడు సీట్ల ఖరారు పైన చంద్రబాబు – పవన్ కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో విజయవాడ పశ్చిమం సీటు పైనా టీడీపీ..జనసేన నేతల మధ్య డైలాగ్ వార్ మొదలైంది.

 

విజయవాడ పశ్చిమంలో కొద్ది రోజులుగా సీటు కోసం టీడీపీ, జనసేన మధ్య వివాదం మొదలైంది. పశ్చిమం సీటు కోరుతూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ర్యాలీ నిర్వహించారు. తనకు పశ్చిమ సీటు లేకుంటా అనకాపల్లి సీటు ఇవ్వాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు కోసం పని చేస్తున్న తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎవరైనా టికెట్ల కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తే సహించనంటూ హెచ్చరించారు. ఆ వెంటనే అదే నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ నేత జలీల్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. పశ్చిమం సీటు ఇవ్వకుంటే ఏం జరుగుతుందో తెలియదని..కార్యకర్తలు అంత ఎమోషనల్ గా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విజయవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలని జలీల్ ఖాన్ కోరారు.

ఇక, ఇదే నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పార్టీ ఇంఛార్జ్ పోతిన మహేష్ టికెట్ రేసులో ఉన్నారు. కొంత కాలంగా పశ్చిమం సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, తాజాగా టీడీపీ నేతలు రేసులోకి రావటంతో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. టీడీపీ నేతల ప్రయత్నాల పైన పోతిన మహేష్ స్పందించారు. పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది నేతలు వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చాక్లెట్ కూడా కొనివ్వలేని ప్రతి ఒక్కరూ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కావాలంటున్నారని చెప్పారు. వారు మతపరంగా బ్లాక్‌మెయిలింగ్ పాలిటిక్స్ పాల్పడుతున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రజలు అమాయకులు కాదన్న విషయం ఆ నేతలు గుర్తుంచుకోవాలని పోతిన వెంకట మహేష్ హెచ్చరించారు.