TELANGANA

2.82 లక్షల ప్రజాపాలన దరఖాస్తుల తిరస్కరణ..!

అభయహస్తం పథకాలు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించారు. జనవరి 17 నాటికి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయింది. వచ్చిన 1,09,01,255 దరఖాస్తులలో 2.82 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. వాటిని నకిలీవిగా గుర్తించి తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డ్ నంబర్‌, రేషన్ కార్డ్ నంబర్ ను నమోదు చేయలేదని వివరించారు. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తుల డేటాను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దరఖాస్తుదారులందరికీ న్యాయం చేయడానికి దరఖాస్తులను పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మళ్లీ పరిశీలన తర్వాత కూడా డేటా మిస్సయిందని లేదా దరఖాస్తు డూప్లికేట్‌గా ఉందని ప్రభుత్వం గుర్తిస్తే, ఆ సమయంలో ప్రభుత్వం ఆ దరఖాస్తులను తిరస్కరించనున్నారు.

 

ప్రజా పలానా అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో ప్రజా పలానా స్టేటస్ చెక్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వారి దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అయితే అప్లికేషన్ నంబర్ మాత్రం ఇంత వరకు ఎవరికి ఇవ్వలేదు. దీంతో స్టేటస్ తెలుసుకోవడం ఎలాగాని చాలా మంది అయోమయానికి గురవుతున్నారు.

 

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, డేటా ఎంట్రీ గందరగోళంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. ఒక్కో అధికారి ఒక్కో విధంగా సమాధానం చెబుతున్నారు. సో దీన్ని బట్టి అభయహస్తం హామీల అమలుకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.