TELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోమారు విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత. ..

తెలంగాణ రాజకీయాల్లో  ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత.. రేపు మరోమారు విచారణకు హాజరు అవుతానని స్పష్టం చేశారు. 11న జరిగిన విచారణలో కవిత ఫోన్‌ను సీజ్‌ చేసింది ఈడీ. మరో వైపు ఈడీ సమన్లపై స్టే కోరుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు కవిత. మహిళను ఈడీ ఆఫీస్‌కి ఎలా పిలుస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్‌ సీజ్ విషయాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. రేపటి విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కవిత కోరగా.. మినహాయింపు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

 

ఈడీ తీరుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 105 పేజీల పిటిషన్ దాఖలు చేశారు కవిత. తన విషయంలో థర్డ్ డిగ్రీ తరహాలో ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చందన్‌రెడ్డిని ఈడీ కొట్టిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. పిళ్లై నుంచి తీసుకున్నది కూడా బలవంతపు స్టేట్‌మెంటేనంటూ అందులో వివరించారు. లిక్కర్ స్కామ్‌లో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

 

ఈడీ ఆఫీస్‌కి పిలిచి విచారించడంపై ముందుగానే అభ్యంతరం వ్యక్తం చేశారు కవిత. ఈ క్రమంలో ఈడీ ముందు ఆమె కొన్ని ఆప్షన్స్ ఉంచారు. వాటికి ఈడీ నో చెప్పడంతో కవిత నేరుగా విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో మరోమారు రేపు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.