TELANGANA

బీఆర్ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి తీగల కృష్ణారెడ్డి…

లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒకరికొకరు పార్టీని వీడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితోపాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రాజీనామా సమర్పించారు.

 

ఫిబ్రవరి 27న చేవెళ్లలో జరగబోయే సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నట్లు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం ఈ ప్రాంత ప్రజలకు సేవచేయాలని ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు పిలుపు మేరకు 1983లో ప్రజా జీవితంలోకి వచ్చానని తీగల కృష్ణారెడ్డి చెప్పారు.

 

గతంలో హుడా ఛైర్మన్‌గా, హైదరాబాద్ నగర మేయర్‌గా, ఎమ్మెల్యేగా పని చేసినట్లు తీగల కృష్ణారెడ్డి తెలిపారు. 2014లో బీఆర్ఎస్‌లో చేరిన తాను పార్టీ ప్రతిష్ఠ కోసం పని చేశానని, కొంత కాలంగా పార్టీ విధేయులను, కార్యకర్తలను విస్మరిస్తుండటంతో కలత చెంది రాజీనామా చేస్తున్నానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు.

 

మరోవైపు, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి కూడా తమ కార్యకర్తల మనోభావాలను ఏకీభవిస్తూ బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనే తీగల కాంగ్రెస్‌లో చేరి, మహేశ్వరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోవడంతో వెనక్కి తగ్గారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పష్టతనిచ్చారు.

 

కాంగ్రెస్ గూటికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఛైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శ్రీలత, శోభన్ రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. హస్తం పార్టీలో చేరిన దంపతులకు సాదర స్వాగతం పలికారు.

 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యమకారులను విస్మరించిందన్నారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న అవమానాన్ని భరించలేక పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తెలిపారు. తమ పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడికి సముచిత గౌరవం, స్థానం కల్పిస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారులకు తగిన గౌరవం ఇస్తుండటంతోనే తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని శోభన్ రెడ్డి దంపతులు తెలిపారు.