National

ఎన్నికల వేళ.. ఆ వివాదాస్పద చట్టం అమలుకు కేంద్రం చర్యలు..

గతంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. వివాదాలకు తెర తీసినట్టవుతోంది.

 

ఇంకొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ స్పష్టతను ఇచ్చిందంటూ వార్తలు వెలువడుతున్నాయి.

 

మార్చి మొదటివారంలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకుని రావడానికి హోం మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే నెల రెండో వారం నాటికి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉండటం వల్ల అంతకంటే ముందే ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోన్నట్లు చెబుతున్నారు.

 

బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన శరణార్థులను ఆదుకోవడం, వారికి దేశ పౌరసత్వాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పట్లో దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఆందోళనలు చోటు చేసుకున్నాయి.

 

దీనితో అప్పట్లో దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో- మరోసారి ఈ వివాదాస్పద చట్టాన్ని అమలు చేయడానికి పూనుకుందని సమాచారం. మార్చి మొదటివారంలోనే నోటిఫై చేస్తుందని అంటున్నారు.

 

సీఏఏకు వ్యతిరేకంగా గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చెలరేగాయి. పలు రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలను చేశాయి. వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాయి. ఈ జాబితాలో తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కేరళ ప్రభుత్వాలు ఉన్నాయి. తమిళనాడు కూడా సీఏఏ అమలుకు పెద్దగా సుముఖంగా లేదు.