TELANGANA

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా.. మార్చి 28న పోలింగ్ జరగనుంది.

 

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

 

ఇది ఇలావుండగా, ఇటీవల ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి విజయం సాధించారు.

 

ఈ క్రమంలో ఆ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేవ్ కుమార్ గౌడ్, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలయ్యారు. ఇక, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ఎంపికయ్యారు.

 

మరోవైపు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కూడా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. బీజేపీ విజయ సంకల్ప యాత్రల పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో విస్తృతంగ ప్రచారం నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను తయారు చేయడంలో నిమగ్నమైంది. బీఆర్ఎస్ కూడా పలు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తూ తమ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించాలని ఈ మూడు పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.