TELANGANA

రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన రేవంత్..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని, తాజాగా మరో రెండు పథకాలు ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మిగతా హామీలు కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

 

కాగా, అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రూ.500కు సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అభయహస్తం ద్వారా ఆరు గ్యారంటీలు ప్రకటించామని తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీని ఎప్పుడూ విస్మరించలేదని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్న సీఎం రేవంత్.. ఆమె స్ఫూర్తితో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 హామీలు అమలు చేశామని గుర్తు చేశారు.

 

చేవెళ్లలో లక్ష మంది మహిళల సమక్షంలో పథకాలు ప్రారంభించాలని భావించామని.. అయితే, అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వల్ల సచివాలయంలో పథకాలు ప్రారంభించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500కే దేశంలోని పేదలందరికి గ్యాస్‌ కనెక్షన్లను యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

 

రూ.400 గ్యాస్‌ సిలిండర్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.1200కు పెంచిందని రేవంత్ ఆరోపించారు. పేదలకు గ్యాస్ సిలిండర్ భారం తగ్గించాలని రూ.500కే సిలిండర్‌ ఇస్తున్నామన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని రేవంత్ సూచించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకాలను వర్తింపచేయనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.