TELANGANA

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరింది. ఈ అంశం పైన తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. దీని పైన విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీని పైన రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు ప్రారంభించారు.

 

హైకోర్టులో విచారణ : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన హరీందర్‌ అనే వ్యక్తి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. దీనిని విచారించిన హైకోర్టులో ఇందులో ప్రజా ప్రయోజనేమీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్ గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో తీవ్ర రద్దీ పెరిగిందని పిటిషనర్ వాదించారు. ఈ మేరకు ఉచిత ప్రయాణంపై ఇచ్చిన జీవో 47ని రద్దు చేయాలని హరీందర్‌ హైకోర్టును కోరారు. అయితే, పిటిషన్‌ ఉచిత ప్రయాణంతో ఇబ్బందులను ఎదుర్కొని పిల్‌ను దాఖలు చేశారని అభిప్రాయపడ్డ ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.

 

జీవో రద్దు చేయాలంటూ : ఆర్టీసీ వ్యవహారాల్లో నిర్ణయం తీసుకొనే అధికారం ప్రభుత్వానికి లేదనేది పిటీషనర్ వాదన.కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదన్నారు. ఉచిత ప్రయాణంతో ఆర్థికంగా ఆర్టీసీ మీద పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించడం అన్యాయమని పిటిషన్‌లో పేర్కొన్నారు. పన్నుల రూపంలో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వెంటనే నిలిపివేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టు కోరారు.

 

హైకోర్టు కీలక సూచన : తన పిటీషన్ లో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్‌, ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. కుటుంబంతో వెళ్తే బస్సుల్లో నిలబడే పరిస్థితి కూడా లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు.