TELANGANA

2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తాం: గత సర్కారులా కాదంటూ రేవంత్ రెడ్డి

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం తెలిపారు.

 

త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు కూడా భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందన్నారు. పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లల్లో ఆనందం చూసే ప్రభుత్వం తమదన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో వైద్య సిబ్బంది పాత్ర కీలకమని చెప్పారు.

 

గడిచిన ఐదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వం వాళ్ల కుటుంబసభ్యుల గురించి మాత్రమే ఆలోచించిందని.. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కుమార్తెను ప్రజలు ఓడిస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని.. తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాల గురించి మాత్రం కేసీఆర్ ఆలోచించిలేదని విమర్శించారు.

 

ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించామని తెలిపారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. హోంగార్డుల నియామకాలు చేపట్టాలని, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు.

 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని చెప్పారు. ఉద్యోగాల భర్తీ చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.