AP

ఎన్నికల్లో అభ్యర్థుల కోసం షర్మిల ఇంటర్వ్యూ..

ఎన్నికలంటే ఏ రాజకీయ పార్టీ కైనా సవాలే. అన్ని రాజకీయ పార్టీలు కేవలం అధికారాన్ని దక్కించుకోవడం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన విజయం దక్కుతుందనే గ్యారెంటీ లేదు. ప్రజల మెప్పు పొందిన వారికే అధికారం లభిస్తుంది. లేకుంటే ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావలసి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని అనుకోదు. ఎందుకంటే అధికారం అనేది చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చు. దేన్నైనా శాసించవచ్చు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణ వేడెక్కింది. ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులు అంటున్నారు.. ఈ క్రమంలో టిడిపి, జనసేన కూటమి తొలి విడతగా 99 మంది అభ్యర్థులను ప్రకటించాయి. రెండో విడతలో మిగతా వారిని కూడా ప్రకటిస్తామని చెబుతున్నాయి. మార్చి మూడున బాపట్లలో జరిగే సిద్ధం సభలో అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు.

 

More

From Ap politics

ప్రధాన పార్టీల పరిస్థితి అలా ఉంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి త్వరలో జనసేన, టిడిపి కూటమిలోకి వెళ్తుందని తెలుస్తోంది. బిజెపి కోసమే రెండవ విడత సీట్లను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెల్లడించలేదని ప్రచారం జరుగుతోంది. ఇక మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇటీవల తన కొడుకు పెళ్లి హడావిడి నేపథ్యంలో కొద్దిరోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొడుకు పెళ్లి పూర్తయిన తర్వాత మళ్లీ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇటీవల ఆమె ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని నేరుగా విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆమె ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా అభ్యర్థులను వడపోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీల వారీగా ఎవరెవరు పోటీ చేస్తారో.. వారందరిని తన వద్దకు పిలిపించుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. “మీ నేపథ్యం, పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, గతంలో ఎటువంటి పదవుల్లో పనిచేశారు, ఇన్ని రోజులు పార్టీ అభివృద్ధి కోసం ఏం చేశారు, ఆర్థికంగా ఖర్చు చేయగలరా” అనే అంశాల ఆధారంగా అభ్యర్థులను షర్మిల ఇంటర్వ్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, షర్మిల అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “అన్న వదిలిన బాణం కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. ఇప్పుడు ఆ బాణం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తోంది. ఇందులో ఎంత మంది గెలుస్తారోనని” నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

 

ఏపీలో మాత్రమే కాదు గత ఏడాది చివర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాన్ని అనుసరించింది. కాకపోతే అక్కడ దరఖాస్తుల స్వీకరణతోనే ఆ ప్రక్రియను ముగించింది. ఇంటర్వ్యూ లాంటివి చేయకపోయినప్పటికీ దరఖాస్తుల స్వీకరించి.. అనేక వడపోతల తర్వాత అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం షర్మిల చేస్తున్న ఇంటర్వ్యూలో ఎంతమందికి సీట్లు వస్తాయో తేలకపోయినప్పటికీ.. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందని చాలా వరకు సర్వే సంస్థలు ప్రకటించాయి. కానీ ఇప్పుడు ఏపీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదని సర్వే సంస్థలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు ప్రకటించిన ఫలితాల ఆధారంగా షర్మిల సీట్లు కేటాయిస్తారా? ఇటీవల షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల టికెట్ల కేటాయింపుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.