AP

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్- హైకోర్టు కీలక నిర్ణయం…

ఏపీలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారాన్ని అధికార వైసీపీ తెరపైకి తెచ్చింది. ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన 9 మంది వైసీపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు ఎందుకు వేయకూడదంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇవాళ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి వివరణ ఇచ్చారు. అయితే విచారణకు తక్కువ సమయం ఇచ్చిన స్పీకర్ నిర్ణయంపై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.

 

ఈ మేరకు హైకోర్టులో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. వీరి తరఫున న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించారు.

 

తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా రాజ్యసభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని హడావిడిగా నోటీసులు ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వైసీపీ రెబెల్స్ తరఫు న్యాయవాదులు వాదించారు. కాబట్టి స్పీకర్ కు అనర్హత ఫిర్యాదులపై స్పందించేందుకు, విచారణ జరిపేందుకు మరింత గడువు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. దీనిపై ఇరు వర్గాలు వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు ఇస్తామని తొలుత చెప్పినా చివరికి రిజర్వు చేసింది. రేపు ఈ పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.