AP

జగన్ ఆపరేషన్ “గోదావరి”, పవన్ ఓట్ బ్యాంక్ పై గురి – అదే జరిగితే, ఇక నో ఛాన్స్..!!

ఏపీలో ఎన్నికల వేళ పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. అక్కడ పట్టు సాధించేందుకు టీడీపీ, జనసేన పూర్తిగా స్థానిక సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలే అస్త్రంగా అభ్యర్దుల ఎంపిక పూర్తి చేస్తన్నారు. ఇదే సమయంలో రెండు జిల్లాల పైన ప్రత్యేక ప్లాన్ అమలుకు సిద్దమయ్యారు.

 

జగన్ కొత్త లెక్కలు: గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలనేది చంద్రబాబు, పవన్ వ్యూహం. పవన్ తొలి నుంచి ఉభయ గోదావరి జిల్లాల పైనే ఫోకస్ చేసారు. కాపు మెజార్టీ ఓట్ బ్యాంక్ తన వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి స్థానికంగా ఉన్న బలం..పవన్ కు సామాజిక వర్గాల మద్దతుతో ఎక్కువ సీట్లు గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిస్తే అధికారికి దగ్గరవ్వాలని వారి ఆలోచన.

 

ఇక్కడే జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. కాపు వర్గంతో పాటుగా బీసీ అస్త్రం ప్రయోగిస్తున్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నారు. రెండు జిల్లాల్లోని సామాజిక సమీకరణాలు..అక్కడి పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. రాజమండ్రి, ఏలూరు ఎంపీ సీట్లను బీసీలకు ఖరారు చేసారు. అమలాపురం రిజర్వ్ స్థానం.

 

సామాజిక సమీకరణాలు: కాకినాడ ఎంపీ సీటు కాపులకు, నర్సాపురం క్షత్రియులకు ఇవ్వాలని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్ల విషయంలోనూ ఇదే తరహా పాలసీ అమలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటులో స్థానికంగా వస్తున్న సమస్యల వేళ జగన్ అలర్ట్ అయ్యారు. తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ ఏలూరు కేంద్రంగా ఫిబ్రవరి 3న సిద్దం సభకు హాజరు కానున్నారు.

 

భీమిలి తరహాలో ఈ సభను సక్సెస్ చేసేందుకు పార్టీ నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జనం హాజరయ్యేల కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ సభ సమయం లోనే స్థానికంగా కొందరు ముఖ్య నేతల చేరికలు ఉంటాయని పార్టీ నేతల సమాచారం. అక్కడ జరిగే సభ ద్వారా జగన్ గోదావరి గట్టు నుంచి టీడీపీ, జనసేనను టార్గెట్ చేయనున్నారు.

 

ఎవరికి కలిసొచ్చేను: అదే విధంగా సీమ జిల్లాల్లో ప్రస్తుతం అనంతపురంలో పూర్వపు పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో, అక్కడే జగన్ మూడో సిద్దం సభకు నిర్ణయించారు. పిబ్రవరి 5న అనంతపురం లో ఈ సభ నిర్వహణకు నిర్ణయించారు.

 

రాయలసీమ జిల్లాలకు చెందిన 49 మంది వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యులు, 8 మంది ఎంపీలతో పాటు చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం తదితర 8 జిల్లాలకు చెందిన పార్టీ నేతలు సుమారు 4 లక్షల మంది అనంతపురంలో జరిగే ఈ సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా గోదావరి..రాయలసీమ కేంద్రంగా జగన్ తన బలం చాటుకొనేందుకు సిద్దమయ్యారు.