భారత పొరుగు దేశం, చిన్న చిన్న దీవుల సమూహమైన మాల్దీవ్స్ పార్లమెంటులో ఆదివారం ఎంపీల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు మధ్య మొదలైన వివాదం.. తన్నులు, ముష్టిఘాతాల వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాల్దీవ్స్‌లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు ఆదివారం పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. కానీ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం మొహమద్ సొలెహ్ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి పక్ష పార్టీ మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ(MDP)కి పార్లమెంటులో మెజారిటీ ఉండడంతో వారు ఈ బిల్లుని అడ్డుకున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎంపీలు సభను అడ్డుకునేందుకు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎంపీలు వారిని వెనక్కు లాగే ప్రయత్నంలో ఇరు వర్గాల ఎంపీల మధ్య ఘర్షణ జరిగింది.
ప్రతిపక్ష పార్టీ MDPకి చెందిన ఎంపీ ఈసా, అధికార పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్లా షహీమ్ అబ్దుల్ హకీం మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెరిగి ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకున్నారు. వీడియోలో అధికార పార్టీ ఎంపీ.. ప్రతిపక్ష పార్టీ ఎంపీ కాలు పట్టుకొని కిందకు పడేశాడు. ఆ తరువాత కింద పడ్డ ఎంపీ అధికార పార్టీ ఎంపీని తన్ని, అతని జుట్టు పట్టుకొని కింద పడేసి ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఆ తరువాత అధికార పార్టీ ఎంపీకి గాయాలు కావడంతో అతడిని ఆంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లారు.