AP

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల-మోసం చేసే వాడే మోడీ అన్న షర్మిల..

గతంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దాన్ని అమలు చేసేదీ తామేనంటోంది. ఈ మేరకు ఇవాళ తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల చేసింది. తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని తెలిపింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓ ప్రకటన చేశారు. ఈ సభలో రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా హాజరయ్యారు.

 

తిరుపతిలోని తారక రామ మైదానంలో ఏపీసీసీ ప్రత్యేక హోదా సాధన సభ నిర్వహించింది. దీనికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ జాతీయ నేత సచిన్ పైలట్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సభలో ఏపీకి ప్రత్యేక హోదా పై పీసీసీ ఛీఫ్ షర్మిల డిక్లరేషన్ ప్రకటన చేశారు. అధికారంలో వచ్చిన వెంటనే హోదాపై రాహుల్ తొలి సంతకం చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. అలాగే పదేళ్లు ప్రత్యేక హోదా అమలు చేస్తామన్నారు.

 

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, హోదా పై మూడు నామాల వానికే మోడీ పంగనామాలు పెట్టాడని షర్మిల ఆరోపించారు. పంగనామాలు పెట్టిన మోడీ ఓ కేడీ అన్నారు. మోడీ అంటే మోసం. మోసం చేసే వాడే మోడీ అన్నారు. హోదా అడిగితే తల్లిని చంపి బిడ్డను వేరు చేశాడు అంటున్నాడన్నారు. నిజానికి తల్లి లాంటి ఆంధ్రను చంపింది మోడీయే అన్నారు. హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోడీ చంపాడన్నారు. పోలవరం కట్టకుండా రాష్ట్రాన్ని చంపుతుంది మోడీనే అన్నారు.

 

విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని చంపింది మోడీనే అని, ప్రత్యేక హోదా ఇచ్చే వాళ్ళు కావాలా ? హోదా ను తాకట్టు పెట్టే వాళ్ళు కావాలా అని షర్మిల ప్రశ్నించారు. కోమాలో ఉన్న కాంగ్రెస్ లో నేను చేరింది కేవలం విభజన హామీల సాధన కోసమే అన్నారు. హోదాకోసం అరాట పడే వాళ్ళ మద్య..హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది అని షర్మిల తెలిపారు. ప్రత్యేక హోదా తో పాటు వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు తీసుకు వస్తానిని హామీ ఇచ్చారు.