AP

రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేది ఎక్కడో వెల్లడించిన వైఎస్ జగన్..

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటిస్తోన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్సొరేషన్-వీఎంఆర్డీఏ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1,500 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను- మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, విడదల రజినితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

 

అనంత‌రం రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వ‌హించిన‌ విజన్ విశాఖ సదస్సుకు హాజరయ్యారు. ఈ స‌ద‌స్సులో 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వివరించారు. విశాఖ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు జగన్. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్దితో ఉన్నామని పేర్కొన్నారు. తన అయిదు సంవత్సరాల కాలంలో విశాఖపట్నంలో చోటు చేసుకున్న అభివృద్ధి ప్రాజెక్టులు, ఇక్కడికి తరలివచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు.

 

త్వరలో జరగబోయే ఎన్నికల్లో తామే గెలవబోతోన్నామని చెప్పారు వైఎస్ జగన్. ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. ఈ సాగర నగరాన్ని దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని, ఈ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

 

వరుసగా రెండోసారి గెలిచిన తరువాత- విశాఖపట్నాన్ని పూర్తిస్థాయిలో కార్యనిర్వాహక రాజధానిగా మారుస్తామని స్పష్టం చేశారు జగన్. విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని అన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ నగరాన్ని ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తామని జగన్ పేర్కొన్నారు.

 

రాజధానిగా అమరావతికి తాము వ్యతిరేకం కాదని జగన్ పునరుద్ఘాటించారు. గతంలో చెప్పినట్లుగా శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని అన్నారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, ఒక వర్గానికి చెందిన మీడియా వల్ల విశాఖ నగరం వెనుకబడి పోయిందని వ్యాఖ్యానించారాయన.

 

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినప్పుడు వాళ్లంతా న్యాయస్థానాలకు వెళ్లారని గుర్తు చేశారు. అన్ని రకాలుగా విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకున్నారని చెప్పారు. ఇది- ఒక్క విశాఖ అభివృద్ధిని మాత్రమే అడ్డుకున్నట్లు కాదని, మొత్తం రాష్ట్రాభివృద్దినే అడ్డుకునేలా వ్యవహరించారని జగన్ పేర్కొన్నారు.

 

విశాఖలో అత్యంత విలువైన వేల ఎకరాల మేర స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతులు, ఇతర బినామీల చేతుల్లో ఉన్నాయని జగన్ చెప్పారు. ఈ అడ్డకులన్నింటినీ అధిగమించి విశాఖను అభివృద్ధి చేస్తామని అన్నారు. మెగా, భారీ పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈలు కూడా చాలా ముఖ్యమని, వాటి ద్వారా 30 లక్షలమందికి ఉద్యోగాలను ఇవ్వగలిగామని అన్నారు