TELANGANA

తెలంగాణ నుంచి లోక్‌సభకు రాహుల్..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఇక్కడా పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.

 

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

 

లోక్‌సభలో బీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. తన ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. అధిక లోక్‌సభ స్థానాలను తన ఖాతాలో వేసుకోవడానికి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తోంది.

 

ఇదే అంశంపై మీడియాతో చిట్‌చాట్‌ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ లోక్‌సభ ఎన్నికలను తమ మూడు నెలల ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తోన్నామని తేల్చి చెప్పారు. ఖచ్చితంగా అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని అన్నారు.

 

రాష్ట్రంలో ఉన్న 16 లోక్‌సభ స్థానాల్లో కనీసం 14 చోట్ల తాము విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారాయన. ముఖ్యమంత్రిగా ఈ మూడు నెలల కాలంలో తన పని తీరును చూసిన తెలంగాణ ప్రజలు.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని, అదే జరగబోతోందనీ అన్నారు రేవంత్ రెడ్డి.

 

భారతీయ జనతాపార్టీ- బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీల మధ్య గల సీట్ల మ్యాపింగ్‌ను పరిశీలించి చూస్తే- ఈ విషయం ఇట్టే అర్థమౌతుందని అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయనేది అందరికీ తెలుసునని పేర్కొన్నారు.

 

ఈ ఎన్నికల్లో తన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయబోరంటూ తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయొచ్చంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు. కుటుంబ సభ్యులతో పోటీ చేయించడానికి తానేమీ కేసీఆర్‌ను కాదని పేర్కొన్నారు.

 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ లోక్‌సభకు పోటీ చేయాలని తాను కోరుకుంటోన్నానని రేవంత్ అన్నారు. భారీ మెజారిటీతో ఆయనను గెలిపించుకుంటామని చెప్పారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలా? వద్దా? అనేది రాహుల్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు.

 

ప్రధాని మోదీని పెదన్నయ్యగా అభివర్ణించడాన్ని సమర్థించుకున్నారు రేవంత్ రెడ్డి. అమెరికా లాంటి దేశాల్లో అధ్యక్షులను బిగ్ బ్రదర్‌గా సంబోధిస్తుంటారని గుర్తు చేశారు. ఓ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిని గౌరవించానని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికి వారు తమకు తోచిన విధంగా అర్థాలను తీశారని నవ్వుతూ చెప్పారు.

 

ఈ నెల 7 లేదా 8 తేదీన కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. అభ్యర్థుల వడపోత తుదిదశలోఉందని వివరించారు. ఒకే దశలో లేదా రెండు దశల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

 

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రాన్ని దోచుకున్నారని, అందుకే తెలంగాణ సమాజం ఆ కుటుంబాన్ని రాజకీయంగా శిక్షించిందని రేవంత్ రెడ్డి అన్నారు. కరడుగట్టిన టెర్రరిస్ట్ కసబ్‌ను కూడా మన దేశం విచారించిందని, అలాంటిది కేసీఆర్‌కు కూడా మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పారాయన.