టీడీపీ రెండో జాబితాలో కీలక మార్పులు కనిపిస్తోంది. సీనియర్ల విషయంలో చంద్రబాబు ఆసక్తి కర నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థుల కసరత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు ఇస్తున్న స్థానాల్లో ఆశావాహులను బుజ్జగిస్తున్నారు. సీనియర్ల సీట్లలో మార్పులు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండో జాబితాలో ఆసక్తి కర నిర్ణయాలు వెలువడనున్నాయి.
వసంతకు సీటు ఖాయం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ టికెట్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కే ఖరారైంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో అచ్చెన్నాయుడు చర్చించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని ఆయనకు తెలిపారు. సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం జరిగిందని స్పష్టం చేసారు.
దీంతో, ఉమా ప్రత్యామ్నాయంగా పెనమలూరు సీటును ఆయన ఆశిస్తున్నారు. దాని పై ఇంకా నిర్ణయం జరగలేదు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం సీటు నుంచి మహాసేన రాజేశ్ తప్పుకున్నారు. ఆయనకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అమలాపురం అసెంబ్లీ స్థా నం పొత్తులో జనసేనకు వెళ్తే.. అక్కడి మాజీ ఎమ్మె ల్యే అయితాబత్తుల ఆనందరావును పి.గన్నవరంలో నిలపాలని టీడీపీ నాయకత్వం యోచిస్తోది.
సీనియర్ల స్థానాల మార్పు
పార్టీ సీనియర్లు కిమిడి కళా వెంకట్రా వు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడారు. ఎచ్చెర్లలో కళావెంకట్రావుతో కొందరు టీడీపీ నేతలు విభేదించి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని.. ఈ పరిస్థితు ల్లో ఆయన విజయనగరం ఎంపీగా పోటీ చేస్తే బా గుంటుందని చంద్రబాబు ప్రతిపాదించారు.
అయితే ఎంపీ సీటుపై ఆసక్తి లేదని, ఎచ్చెర్లలో అందరినీ కలుపుకొని వెళ్తానని.. అవకాశమివ్వాలని కళా కోరారు. ఇక సర్వేపల్లిలో తాను అధికార పార్టీ ఒత్తిళ్లకు ఎదురొడ్డి అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నానని, తనకే అవకాశమివ్వాలని సోమిరెడ్డి కోరారు. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిని ఖరారు చేసినట్లు సమాచారం. ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు నుంచి ఖరారు చేసారు.
రెండో జాబితాపై కసరత్తు
మాజీ మంత్రి గంటాను చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని చంద్రబాబు మరోసారి సూచించారు. గంటా మాత్రం అందుకు ఆసక్తిగా లేరని ప్రచారం సాగుతోంది. విశాఖ పరిధిలో సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక, మరో సీనియర్ నేత యరపతినేని కి గురజాల సీటు ఖాయమైంది. రెండో జాబితాలో ఆయన పేరు ఉండనుంది. పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ కు సర్వేలు అనుకూలగా లేవని అధినేత స్పష్టం చేసినట్లు సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా గోపాల పురం సీటుపైన చర్చలు జరుగుతున్నాయి. డాక్టర్ అనిల్, మాజీ మంత్రి పీతల సుజాత పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దీంతో.. ఇప్పటికే జనసేన సీట్లు ఖరారు కావటంతో..బీజేపీతో పొత్తు ఖాయమైన తరువాత…చంద్రబాబు తన అభ్యర్దుల రెండో జాబితా ప్రకటించనున్నారు.