TELANGANA

మేడారం జాతర హుండీ లెక్కింపు పూర్తి..

మేడారం (Medaram) సమ్మక్క-సారక్క మహా జాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 540 హుండీలను లెక్కించగా.. రూ. 13.25 కోట్ల ఆదాయం సమకూరింది. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండిని అమ్మవార్లకు భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు.

 

హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఫిబ్రవరి 29 నుంచి హుండీలను లెక్కించారు. మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలు సమ్మక్క-సారక్కలను దర్శించుకున్న విషయం తెలిసిందే. కాగా, 2022 మేడారం జాతర కంటే ఈ ఏడాది జాతరకు రూ.1.79 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

 

ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర ఘనంగా జరిగింది. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నోట్లు, కాయిన్స్ కలిపి మొత్తం 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయలు వచ్చాయి. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి వచ్చింది. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.

 

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌కే ప్రసాద్

 

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి( Komuravelli)శ్రీ మల్లికార్జున స్వామివారిని భారత క్రికెట్‌ జట్టు మాజీ క్రికెటర్‌, బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌(MSK Prasad) బుధవారం దర్శించుకున్నారు. మల్లన్న దర్శనానికి వచ్చిన మాజీ క్రికెటర్‌కు మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు తాళ్లపల్లి రమేశ్‌, అల్లం శ్రీనివాస్‌, లింగంపల్లి శ్రీనివాస్‌లు స్వాగతం పలికారు.

 

అనంతరం మల్లన్న ఆలయంలో స్వామి వారిని ఎంఎస్‌కే ప్రసాద్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌కే ప్రసాద్‌ మాట్లాడుతూ.. తన మిత్రుని ద్వారా కొమురవెల్లి మల్లన్న ఆలయ వివరాలు తెలుసుకుని దర్శనం కోసం వచ్చినట్లు ప్రసాద్ తెలిపారు. ఆలయం చాలా బాగుందని అన్నివర్గాల ప్రజలు స్వామి వారిని దర్శించుకోవాలన్నారు.