TELANGANA

కమీషన్ ఇస్తేనే దళిత బంధు.. లంచాలకు అలవాటు పడ్డ బీఆర్ఎస్‌ నాయకులు..

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కమీషన్ల సర్కార్‌గా మారిపోయిందంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దళితబంధు స్కీంలో లంచాలు లేనిదే నిధులు విడుదల కావడం లేదంటూ చాలా మంది మొత్తుకుంటున్నారు. అంతెందుకు సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తన పార్టీ ఎమ్మెల్యేలను ఇదే విషయంలో హెచ్చరించారు కూడా.

 

దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల జాబితా తన దగ్గరు ఉందని కేసీఆర్ అన్నారు. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తొలగిస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యతని తెగేసి చెప్పారు. అటు డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపిక విషయంలోనూ ఆరోపణలున్నాయని గుర్తుచేశారు. కానీ చివరికి అదే ఎమ్మెల్యేలకు మళ్లీ ఎన్నికల టికెట్ ఇచ్చారు. ఇదంతా గమనిస్తే కేసీఆర్ కూడా ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో కేసీఆర్ సర్కార్ 30 శాతం కమీషన్ సర్కార్ అంటూ విమర్శలు పెరుగుతున్నాయి.

 

కేసీఆర్ సర్కార్ చేపడుతున్న సంక్షేమ పథకాల లిస్టులో పేరు రావాలంటే పెద్ద మొత్తంలో సమర్పించుకోవాల్సిందే అన్న ఆరోపణలు గట్టిగా వినపడుతున్నాయి. దళితబంధు, బీసీ బంధు, అటు డబుల్ బెడ్రూం ఇండ్ల జాబితాలో ఇలాంటివే తెరపైకి వచ్చాయి. ఒక దశలో డబుల్ బెడ్రూం లిస్టులో పేర్ల కోసం చాలా మందిని నమ్మి డబ్బులు చెల్లించి జనం మోసపోయారు. అదే సమయంలో బీఆర్ఎస్ సానుభూతి పరులకే సంక్షేమ పథకాలు ఇప్పించుకుంటున్నారన్న విమర్శలు జనం నుంచి వినిపించాయి.

 

తాజాగా దళితబంధు విషయంలో కమీషన్లు, లంచాలపై ఓ ఆసక్తికర ఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనమా తీరుపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనమా వెంకటేశ్వరరావు ప్రచార వాహనాన్ని సింగభూపాలెం గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రచార వాహనం ఊళ్లోకి రాకుండా ఓ దివ్యాంగుడు తన వీల్‌చైర్ అడ్డుపెట్టారు. దళితబంధు లబ్దిదారుల నుంచి ఎమ్మెల్యే వనమాతోపాటు ఆయన కొడుకు వనమా రాఘవ కూడా 50 మంది నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని దివ్యాంగుడు ఆరోపించారు. డబ్బులిస్తేనే దళితబంధు పథకంలో పేరు వస్తోందని, అసలు అర్హులైన వాళ్లు ఎమ్మెల్యేకు డబ్బు ఎందుకివ్వాలని ఆయన ప్రశ్నించడం కీలకంగా మారింది. సింగభూపాలెంలో దాదాపు 50 మంది దళితుల దగ్గర, 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశారని దివ్యాంగ వ్యక్తి ఆరోపించారు.

 

10 లక్షలు వస్తాయనే ఆశతో చాలా మంది అప్పు చేసి డబ్బు కట్టారని.. దళితబంధులో పేరు రాలేదని అడిగితే, ఎన్నికల్లో గెలిపిస్తే ఇస్తామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్న మాటలపై అర్హులైన ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనమా వర్గీయులను దివ్యాంగుడు నిలదీస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

 

తీస్ పర్సెంట్ కమీషన్ సర్కార్ అంటే ఇదేనంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలో వనమా రాఘవపై చాలా ఫిర్యాదులు ఉన్నాయి. రాఘవ అరాచకాలను భరించలేకపోతున్న పరిస్థితి ఉందని స్థానికలు అంటున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ హైకమాండ్ కూ ఫిర్యాదు కూడా వెళ్లింది. మరి ఇప్పుడు ఎన్నికల్లో దళితబంధు కమీషన్ల విషయం బీఆర్ఎస్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో వేచి చూడాలి మరి!