AP

టీడీపీ, బీజేపీ, జనసేన తొలి సభకు ముహుర్తం ఖరారు-ప్రధాని మోడీ హాజరు !

ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఇవాళ పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పీటీఐ వార్తాసంస్ధకు వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ పొత్తు ప్రకటన నేపథ్యంలో తదుపరి పరిణామాలకు చకచకా రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా మూడు పార్టీల నేతలతో తొలి ఉమ్మడి సభ నిర్వహణకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది

 

టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు నేపథ్యంలో ఇకపై ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా అడుగులు వేయబోతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఈ మూడు పార్టీలు ముందుగా ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేసి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలకు ఈ నెల 17న ముహుర్తం సిద్ధం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల సభ ఈ నెల 17న జరగనుంది. ఈ సభలో ఇప్పుడు బీజేపీ కూడా చేరనుంది.

 

టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో కాస్తా మూడు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోగా మారబోతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన సిద్దం చేసుకున్న మ్యానిఫెస్టోకు బీజేపీ తరఫున చేర్చాల్సిన హామీల్ని కూడా చేర్చి కొత్త మ్యానిఫెస్టో సిద్ధం చేసే అవకాశాలున్నాయి. అలాగే ఈ మ్యానిఫెస్టో విడుదలను ప్రధాని మోడీ చేతుల మీదుగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చిలకలూరిపేట సభకు ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా మూడు పార్టీల ఇతర కీలక నేతలంతా హాజరు కాబోతున్నారు.

 

ఈ సభలోనే ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటనతో మూడు పార్టీల కూటమి ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడి సభలు నిర్వహిస్తుండగా.. అది కాస్తా ఇకపై మూడు పార్టీల కూటమి సభలుగా మారబోతోంది. అంటే ఎన్డీయే తరఫున ఇకపై సభలు ఉంటాయన్న మాట. దీంతో ఎన్డీయే వర్సెస్ వైసీపీగా ఏపీలో ఎన్నికల రణరంగం మారబోతోంది.