అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకులను మార్చేసింది. వారి స్థానంలో కొత్త నాయకులను తెరమీదికి తీసుకొచ్చింది. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు.. వంటి లోక్‌సభ స్థానాలకు కొత్త సమన్వయకులు అపాయింట్ అయ్యారు ఇదివరకే.
ఇటీవలే మచిలీపట్నం లోక్‌సభ, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను మార్చివేసింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. గెలుపోటములకు సంబంధించిన నివేదికలు, స్థానిక నాయకుల అభిప్రాయాలు, అభ్యర్థుల మనోగతాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి గతంలో సింహాద్రి రమేష్ బాబు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే- అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌ను ఇన్‌ఛార్జీగా నియమించింది. మచిలీపట్నం లోక్‌సభకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, అవనిగడ్డ అసెంబ్లీకి సిట్టింగ్ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్ బాబును ఇన్‌ఛార్జీలుగా అపాయింట్ చేసింది.
ఇప్పుడు తాజాగా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కొత్తగా చేర్పులు జరిగాయి. చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఒంగోలు లోక్‌సభతో పాటు ఉమ్మడి నెల్లూరు రీజినల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఆయనకు తోడుగా డిప్యూటీ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నియమితులు అయ్యారు.
ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు లోక్‌సభ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే ఖరారయిన నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపైనా దృష్టి సారించాల్సి ఉన్నందున సుధాకర్ బాబును డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్‌గా అపాయింట్ చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.