AP

కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తో పవన్ కళ్యాణ్ భేటీ..

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో కలిశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గజేంద్ర షెకావత్ ఆదివారం విజయవాడ చేరుకున్నారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం కూటమిలో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

 

పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు, 6 లోక్‌సభ స్థానాలు కేటాయించినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిశారు. కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం మూడు పార్టీల పొత్తుపై ప్రకటన చేశారు.

 

టీడీపీ-జనసేన పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

 

తెలుగుదేశం, జనసేనతో పొత్తు ఖరారు కావడం సంతోషకరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హితం కోసం అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలుగా కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో బీజేపీ మేనిఫెస్టో రథాలను పురందేశ్వరి ప్రారంభించారు.

 

9 జిల్లాల్లో ఈ వాహనాల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామన్నారు. మేనిఫెస్టో తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే వారి ముందుకు బీజేపీ ప్రచార రథాలను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ రథాల్లో రెండు బాక్సులు ఉంటాయని, ఒకటి కేంద్రం నుంచి ఏం ఆశిస్తున్నారు? మరొకటి రాష్ట్రం నుంచి ఏం కావాలనే విషయాలను బాక్సుల్లో లేఖలు రాసి వేయాలని ఆమె సూచించారు. ఈ అభిప్రాయాలు జాతీయ స్థాయిలోనూ, అలాగే రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టో రూపకల్పనలోనూ ఉపయోగపడతాయన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45 వేల కుటుంబాల నుంచి అభిప్రాయాలను స్వీకరించాలనేది బీజేపీ లక్ష్యంగా ఉందన్నారు. పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సేవ ఎనలేనిదని, వచ్చే ఐదేళ్లలో ఏం చెయ్యబోతున్నామనేది ప్రచార రథాల ద్వారా వివరిస్తామన్నారు. బీజేపీ మూల సిద్ధాంతం అట్టడుగు వర్గాల సంక్షేమమేనని తెలిపారు. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ఖరారైన క్రమంలో ఒకట్రెండు రోజుల్లో సీట్ల వివరాలపై స్పష్టత వస్తుందని పురంధేశ్వరి తెలిపారు.