National

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా..

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.

 

దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలో బిజూ జనతాదళ్, అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా- బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

 

2019 తరహాలోనే దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ పూర్తి అయ్యేలా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ రెండోవారంలో తొలి దశ పోలింగ్ ఉండొచ్చు. మే 18 లేదా 20వ తేదీ నాటికి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది. అదే నెల చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఈ పరిస్థితుల్లో అనూహ్యం సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపించారు. దీన్ని రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

 

ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది. అరుణ్ గోయెల్ రాజీనామా.. తక్షణమే అమలవుతుందని తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అరుణ్ గోయెల్.. తప్పు కోవడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమౌతోంది.