AP

వైసీపీకి మరో షాక్..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు ఒకొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ అధిష్టానంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరుఫున రాజోలు నియోజరవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 

ఆ పార్టీ తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాకనే కావడం విశేషం. జనసేన గుర్తు మీద గెలిచిన రాపాక.. వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా మారిపోయారు.సీఎం జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు ఆయన బహిరంగంగానే తన మద్దతు ప్రకటించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు. అయితే తాను ఒకటి తలిస్తే జగన్ మరొకటి తలిచారు.

 

రాపాకను కాదని టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోల్ టికెట్ ఖారారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో రాపాకకు అమలాపురం ఎంపీ సీటు కేటాయించారు. తొలుత అమలాపురం నుంచి పోటీ చేయడానికి రాపాక సముఖత వ్యక్తం చేసినప్పటికీ తాజాగా ఆయన వైసీపీపై తిరుగుబాటు చేశారు. వైసీపీ ఆవిర్భావం నాడే రాపాక వైసీపీ అధిష్టానాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

 

తనకు కాకుండా వేరే వ్యక్తికి రాజోలు సీటు ఇస్తే మరోసారి వైసీపీ ఓడిపోవడం ఖాయమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2014,2019 ఎన్నికల్లో రాజోలులో వైసీపీ ఓడిపోయిన విషయాన్ని రాపాక గుర్తు చేస్తున్నారు. అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న సంకేతాలు రావడంతోనే రాపాక ఇలా యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది.

 

అందుకే ఆయన మళ్లీ రాజోలు అసెంబ్లీ టికెట్ కోసం పరితపిస్తున్నారని అంటున్నారు. రాపాక మాటలు విన్న తరువాత ఆయన అమలాపురం ఎంపీగా పోటీ చేయరనే విషయం స్పష్టం అవుతుంది. మరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన రాపాకపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.