AP

పిఠాపురం నుంచే పవన్ ప్రచారం-మూడు రోజులు అక్కడే.. !

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం సీటు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నెల 27న పిఠాపురం వెళ్లి అక్కడ ప్రచారం చేశాక రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రెగ్యులర్ గా వెళ్లేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఇవాళ జనసేన నేతలతో చర్చించి ఆయన షెడ్యూల్ ఖరారు చేశారు.

 

ఈసారి ఎన్నికలకు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ఇవాళ జనసేన ముఖ్య నేతలతో జరిగిన భేటీలో పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. శక్తిపీఠం కొలువైన క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పురూహూతిక దేవికి పూజలు నిర్వహించి పవన్ వారాహి వాహనం నుంచి ఈ ప్రచారం ప్రారంభిస్తారు.

 

పిఠాపురం ఆ నియోజక వర్గంలోనే మూడు రోజులపాటు ప్రచారం చేశాక పవన్ కళ్యాణ్ ఇతర నియోజకవర్గాలకు వెళ్తారు. ఈ మూడు రోజుల పిఠాపురం టూర్ లో పవన్ .. నియోజక వర్గంలోని ముఖ్య నాయకులు, మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించబోతున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పవన్ పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలకు ఆదేశాలిచ్చారు.

 

తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో పిఠాపురంలో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని… ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని జనసేన నేతలకు పవన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయిని, ఇందుకోసం సాగిస్తున్న ఈ సమరంలో కచ్చితంగా విజయం మనదే అన్నారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందని, ఈ విజయ నాదం రాష్ట్రం నాలుగు వైపులా వినిపించాలన్నారు. ఎన్నికల నియమనిబంధనలు పాటించడంపైనా టూర్ మేనేజ్మెంట్ సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు.