TELANGANA

ఎంపీ అభ్యర్థులుగా కేసీఆర్ అనూహ్య ఎంపిక – మరో ఇద్దరి ప్రకటన..!!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. మూడు ప్రధాన పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చేశారు.

 

అభ్యర్థుల ఖరారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లోను పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాలను రెండు విడతలుగా ఖరారు చేసింది. బిజెపి తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇదే సమయంలో బిఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసిఆర్ వరుసగా ఖరారు చేస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పి వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ ప్రకటించారు.

 

మరో ఇద్దరి ప్రకటన టిఆర్ఎస్ నుంచి ఈ ఇద్దరు అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇంకా భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు, చేవెళ్ల నుంచి కాసాని, అదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య పేర్లను ప్రకటించారు.

 

మూడు పార్టీలకు కీలకం మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లు సాధించాలనేది మూడు పార్టీల లక్ష్యంగా కనిపిస్తుంది. బిజెపి ఈసారి మెజార్టీ సీట్లు సాధించేందుకు అభ్యర్థుల ప్రకటనతో పాటుగా ప్రచారంలోనూ వేగం పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ అత్యధిక స్థానాలు గెలుచుకోవటం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గులాబీ పార్టీలోని నేతలను పెద్ద సంఖ్యలో తమ పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు మెజార్టీ సీట్లు సాధించటం రేవంత్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా మారింది.