తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగన్ వాడీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తో పాటు బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం సీఎం రేవంత్ మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికిమంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి ఇతర అధికారులు హాజరయ్యారు.
అంగన్ వాడీల ద్వారా బాలింతలు, గర్భిణీలకు మంచి పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార పంపిణీ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొబైల్ అంగన్ వాడీల కేంద్రాలను పరిశీలించాలన్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ హెచ్ఎండీఏ సంబంధించి అధికారులతో చర్చించారు.
హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హెచ్ఎండీఏ పరిధిలో జీహెచ్ఎంసీ, పాటు మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటిని హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా మార్చే అవకాశం ఉంది.
మొత్తం ఒకే కార్పొరేషన్ గా చేస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉండడంతో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధి ఉండే అవకాశం ఉంది.