TELANGANA

సిట్టింగ్ లకే ప్రాధాన్యం.. బండి, ధర్మపురి, కిషన్ రెడ్డి మరోసారి అవకాశం…

త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 195 మందితో మొదటి లిస్ట్ ను శనివారం సాయంత్రం ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన అభ్యర్థుల్లో సిట్టింగ్ లే ఎక్కువగా ఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ పేరును ప్రకటించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ పేరును ప్రకటించారు.

 

అర్వింద్ నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి మంత్రి కిషన్ రెడ్డి మరోసారి అవకాశం దక్కించుకున్నారు. ఆయన కూడా సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పేరును ప్రకటించారు. బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈ మధ్యే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక నాగర్ కర్నూల్ అభ్యర్థిగా భరత్ పేరును ప్రకటించారు. భరత్ నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు తనయుడు. రాములు ఈ మధ్యే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

 

వీరంతా సిట్టింగ్ ఎంపీలుగా భావించవచ్చు. ఇక భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించారు. బూర నర్సయ్య గౌడ్ 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ తరుఫున పోటీ చేయబోతున్నారు. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరును ప్రకటించారు. ఆయన కూడా 2014లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.

 

2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఆయన తొలిసారిగా ఎంపీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. హైదరాబాద్ నుంచి కోంపల్లి మాధవి లత ఎంపీగా తొలిసారి పోటీ చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు పేరు తొలి జాబితాలో రాలేదు.