TELANGANA

ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి.. కేసీఆర్‌పై జరిగినట్టే..!..

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం తెలంగాణలో కలకలం రేపింది. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరచాలనం చేసేందుకు వచ్చిన రాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డిని మొదట గజ్వేల్‌లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌ యశోద హాస్పిటల్‌లో కొత్త ప్రభాకర్‌రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. నారాయణఖేడ్‌ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్‌రావుకు దాడి సమాచారం అందింది. వెంటనే ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు మంత్రి హరీష్‌రావు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి చికిత్స చేసిన డాక్టర్‌ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. హైదరాబాద్ తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న సీఎం కేసీఆర్ హరీష్‌ రావుకు ఫోన్ చేసి ప్రభాకర్‌ రెడ్డి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ప్రభాకర్ రెడ్డికి చికిత్స గురించి ఆరాతీశారు. నారాయణ ఖేడ్ సభ అనంతరం సీఎం కేసీఆర్.. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు ఆసుపత్రికి రానున్నారు. ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని హరీశ్ రావు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు.. వైద్యులను కలిసి మాట్లాడారు.

 

ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు..

ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి బాన్సువాడ కేంద్రంగా సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చేతకాని దద్దమ్మలు కొత్త ప్రభాకర్‌పై దాడిచేశారు.. ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి.. కేసీఆర్‌పై దాడి జరిగినట్లే.. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఎప్పుడూ హింస జరగలేదు.. ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు అంటూ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అభివృద్ధికి ఏకైక కొలమానం – తలసరి ఆదాయం.. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్.. పదేళ్లు నీతి, నిబద్ధతతో పనిచేస్తేనే అది సాధ్యమైంది.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. పోచారం సారథ్యంలో బాన్సువాడ..బంగారువాడ అయ్యిందని.. గెలిచిన తర్వాత పోచారం శ్రీనివాస్‌కి పెద్దహోదా దక్కుతుంది.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.