HealthNational

కోవిడ్ కారణంగా తీవ్రంగా బాధపడ్డారా..? అయితే మీకే ఈ అలెర్ట్..

కరోనా ప్రపంచాన్ని ఎంత దడదడలాడించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాయదారి రోగం బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వ్యాక్సిన్స్ వచ్చాయన్న ధైర్యం ఉన్నా.. ఈ మహమ్మారి రూపం మార్చుకుని ఎలా అటాక్ చేస్తుందోనన్న ఆందోళన కూడా జనంలో ఉంది. కాగా ఇటీవల గుండెపోటు మరణాలు కూడా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో.. కేవలం వయస్సు మీదపడిన వృద్ధులు మాత్రమే గుండెపోట్లతో ఎక్కువగా చనిపోయేవారు. కానీ ఇటీవలి కాలంలో ఫిట్‌గా ఉన్నవారు సైతం.. పిట్టల్లా రాలిపోతున్నారు. డైలీ జిమ్‌కి వెళ్లి వర్కువుట్స్ చేసేవారు సైతం.. సెకన్ల వ్యవధిలో గుండెపోటుతో లోకాన్ని వీడుతున్నారు. టీనేజర్స్, యువత సైతం గుండెపోట్ల బారిన పడటం ఇప్పుడు ఆందోళనకర అంశంగా మారింది. ఈ క్రమంలోనే కరోనాకు, గుండెపోటుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు రోజురోజుకూ తీవ్రం అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది.

 

హార్ట్ అటాక్ రావడానికి కారణం, దాన్ని రాకుండా నివారించేందుకు మార్గాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వివరించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చేసిన రీసెర్చ్ ఉదహరించిన మన్‌సుఖ్ మాండవీయ.. గతంలో కరోనా వచ్చి రికవర్ అయినవారికి వారికి కొన్ని సూచనలు చేశారు. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న బాధితులు.. ఒకటి-రెండు సంవత్సరాల పాటు ఒత్తిడి, శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిదని చెప్పారు. ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా చూసుకుంటే.. ప్రమాదకర గుండె పోటు నుంచి రక్షించుకోవచ్చన్నారు. కరోనా తగ్గిన తర్వాత రెండేళ్ల వరకూ కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలన్నారు. కరోనా సోకిన వ్యక్తులకు.. గుండె పోటు ముప్పుపై ICMR ఒక వివరణాత్మక అధ్యయనం చేసిందని మన్‌సుఖ్ మాండవీయా తెలిపారు. ఆ రీసెర్చ్ ప్రకారం తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడ్డవారు ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయకూడదని హెచ్చరించారు. ఎక్కువ సమయం విశ్రాంతికి కేటాయించాలన్నారు. ఎక్కువ కాలం కఠిన వ్యాయామానికి దూరంగా ఉంటే గుండె పోటు నుంచి రక్షణ పొందవచ్చన్నారు.

 

ఇటీవల దేశవ్యాప్తంగా దసరా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌లో గార్బా డ్యాన్స్‌లు చేస్తూ గుండెపోట్లతో అనేకమంది కుప్పకూలారు. దీంతో గుజరాత్ హెల్త్ మినిస్టర్ రుషికేష్ పటేల్ కార్డియాలజిస్టులు, వివిధ వైద్య నిపుణులతో సమావేశాన్ని నిర్వహించారు. గుండెపోటుకు డీజే శబ్ధాలకు సంబంధం ఉందా..? లేదా కోవిడ్ వచ్చినవారిలోనే ఇలా జరుగుతుందా..? లేదా జీవనశైలిలో మార్పుల కారణమా అనే అంశాలపై సమాచారాన్ని సేకరించాలని వైద్య నిపుణులను రుషికేష్ పటేల్ కోరారు.