AP

వైసీపీ మేనిఫెస్టోలో కీలకాంశాలు..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

 

ఈ నెల 27వ తేదీన బస్సుయాత్ర ప్రారంభం కాబోతోంది. అదే రోజున కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్. 28న నంద్యాల, 30న ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా గుత్తిలో ఈ సభలు ఏర్పాటయ్యాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటారు.

అనంతరం చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తారు జగన్. ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ సభలు జరుగనున్నాయి. 2వ తేదీన పీలేరులో బహిరంగ సభలో పాల్గొంటారాయన. 3వ తేదీన సాయంత్రం తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో జగన్ బస్సు యాత్ర ఉంటుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, నాయుడుపేటల్లో బహిరంగ సభలకు హాజరవుతారు.

 

మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభలపై చిత్తూరు జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ కే రోజా.. తిరుపతిలో సమీక్ష నిర్వహించారు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధూసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, రెడ్డెప్ప రెడ్డి, జిల్లాకు చెందిన పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. మేమంతా సిద్ధం పోస్టర్‌ను ఆవిష్కరించారు.

 

అనంతరం రోజా మాట్లాడారు. మరోసారి వైసీపీని గెలిపించడానికి, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతీ హామీనీ జ‌గ‌న్‌ నెరవేర్చారని, తండ్రి తగ్గ తనయుడుగా పాలన అందించార‌ని చెప్పారు. 2014 తరహాలో చంద్రబాబు మళ్లీ మూడు పార్టీలను వెంటేసుకుని ప్రజలను మోసం చేయడానికి వచ్చాడని, ఈ కూటమిని జనం నమ్మరని వ్యాఖ్యానించారు.

నవరత్నాల తరహాలో సరికొత్త మేనిఫెస్టోను జగన్ విడుదల చేయబోతోన్నారని రోజా అన్నారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా మేనిఫెస్టో ఉండబోతోందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ జగన్ నెరవేరుస్తారని రోజా ధీమా వ్యక్తం చేశారు.

 

ఏ సినీ నటుడుకి లేని క్రేజ్ జ‌గ‌న్‌కు ఉందని, ఈ బస్సు యాత్రలో ఆ విషయం మరోసారి రుజువు కాబోతోందని రోజా పేర్కొన్నారు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలే ఉంటాయని, అందుకే 24 సీట్లు తీసుకున్నానంటూ చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు 21 సీట్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదని, త్రివిక్రమ్ రాసివ్వలేదేమోనని ఎద్దేవా చేశారు.