లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోన్నాయి. గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లను ఇస్తోన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పలు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మహబూబాబాద్- మాలోత్ కవిత, కరీంనగర్- బీ వినోద్ కుమార్, పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్, ఖమ్మం- నామా నాగేశ్వర రావు, వరంగల్- కడియం కావ్య, చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్, జహీరాబాద్- గాలి అనిల్ కుమార్, నిజామాబాద్- బాజిరెడ్డి గోవర్ధన్, నాగర్ కర్నూల్- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్- వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తోన్నారు.
ఇప్పుడిదే జాబితాలో మరో పేరు చేరింది. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి పేరును ప్రకటించారు కేసీఆర్. సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ స్పీకర్ టీ పద్మారావు లోక్‌సభ బరిలో నిలిచారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారాయన. 2014, 2018, 2023 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఆయనను సికింద్రాబాద్ లోక్‌సభలో నిలిపింది బీఆర్ఎస్.
ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం సికింద్రాబాద్. అయిదుసార్లు బీజేపీకి పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. బండారు దత్తాత్రేయను ఎన్నుకున్నారు. క్రియాశీలక రాజకీయాల నుంచి బండారు దత్తాత్రేయ తప్పుకొన్నాక.. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.
బీజేపీ తరఫున మరోసారి కిషన్ రెడ్డే సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి దానం నాగేందర్ బరిలో దిగారు. బీఆర్ఎస్ కూడా తన అభ్యర్థిగా పద్మారావును ప్రకటించారు. దీనితో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.