AP

వైఎస్ జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు.

 

175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి ముహూర్తం సమీపించింది. బుధవారం మధ్యాహ్నం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇడుపులపాయలో లాంఛనంగా ప్రారంభించనున్నారు జగన్. వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రికి నివాళి అర్పించిన అనంతరం బస్సు యాత్ర చేపడతారు.

 

ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:30కు కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు బయలుదేరుతారు. ఒంటి గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళి అర్పిస్తారు.

 

1.30 గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. అక్కడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

 

అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో బస చేస్తారు. తొలి రోజు మొత్తంగా 115 కిలోమీటర్ల పాటు బస్సు యాత్ర కొనసాగుతుంది