ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే కడప జిల్లా ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగుస్తుంది.
ఇడుపులపాయలో బస్సు యాత్రను ప్రారంభించిన అనంతరం కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకున్నారు జగన్. అక్కడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మార్గమధ్యలో వేలాది మందిని పలకరిస్తూ రావడం వల్ల అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైందీ సభ.
YS Jagan made key remarks on Vivekananda case
ఈ సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా ప్రజలను తన కుటుంబ సభ్యులుగా అభివర్ణించారు. జిల్లా ప్రజలు ఎప్పుడూ తన వెన్నంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనూ తనకు ఈ జిల్లా అండగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సత్సంకల్పంతో చేపట్టిన బస్సు యాత్రకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టానని జగన్ అన్నారు.
తనకు అండదండగా ఉంటూ వస్తోన్న ప్రజా సైన్యం మధ్య ఎన్నికల జైత్రయాత్రకు శ్రీకారం చుట్టానని జగన్ చెప్పారు. తన అయిదు సంవత్సరాల పరిపాలనలో ఎన్నో మార్పులను చూశామని, భావి తరాల కోసం విప్లవాత్మక నిర్ణయాలను తీసుకోవడమే కాదు.. వాటిని అమలు చేశామని జగన్ పేర్కొన్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా 2,70,000 వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో వేశామని జగన్ గుర్తు చేశారు. దీనికోసం తాను ఎన్నోసార్లు బటన్ నొక్కానని వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా మే 13వ తేదీన పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్పై ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అదే సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్నీ జగన్ ప్రస్తావించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. బురద చల్లడానికి తన ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో కూడా వారికి తెలుసునని చెప్పారు.
తన ఇద్దరు చెల్లెమ్మల వెనక ఎవరు ఉన్నారో కూడా అందరికీ తెలిసిన విషయమేనని, వారంతా రోజూ కనిపిస్తూనే ఉన్నారని జగన్ చెప్పారు. వివేకం చిన్నాన్నను దారుణంగా చంపిన హంతకుడికి వాళ్లు మద్దతు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంపిన వాడిని చంద్రబాబుతో పాటు ఒక వర్గం మీడియా నెత్తిన పెట్టుకున్నాయని, ముద్దాయిలతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారని ఆరోపించారు.