National

కేజ్రివాల్ కు అమెరికా మద్దతు-అరెస్టు, విచారణపై కీలక వ్యాఖ్యలు..!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను ఈడీ అరెస్టు చేయడం, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు అంతర్జాతీయంగా పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే జర్మనీతో పాటు పలు దేశాలు కేజ్రివాల్ కేసు విచారణ నిష్పాక్షికంగా చేయాలని భారత్ ను డిమాండ్ చేస్తుండగా.. ఇప్పుడు ఆ జాబితాలో మిత్రదేశంగా చెప్పుకునే అమెరికా కూడా చేరింది. ఈ మేరకు అమెరికా కేజ్రివాల్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది.

 

అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను అమెరికా ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడికి “న్యాయమైన, పారదర్శక మరియు సమయానుకూల న్యాయ ప్రక్రియ” ఉండేలా భారతప్రభుత్వాన్ని కోరుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి రాయిటర్స్‌తో చెప్పారు. దీంతో కేజ్రివాల్ కు అన్యాయం జరుగుతోందనే ఆందోళనను అమెరికా వ్యక్తం చేసినట్లయింది. అయితే దీనిపై కేంద్రం ఇంకా స్పందించలేదు.

 

మరోవైపు భారత్ లో ఇతర నిందితుల తరహాలోనే కేజ్రివాల్ పై నిష్పాక్షిక విచారణ జరపాలని జర్మనీ తాజాగా కోరింది. న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్ర్యం, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసులో కూడా వర్తిస్తాయని తాము ఆశిస్తున్నట్లు జర్మనీ ఇప్పటికే తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ మండిపడింది. భారత్ లో ఆ దేశ రాయబారిని పిలిపించి నిరసన తెలిపింది.