ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ఇవాళ విడుదలైంది. ఇప్పటికే దీనిపై పలు దఫాలుగా కసరత్తు చేసిన అధిష్టానం పెద్దలు.. ఇవాళ సాయంత్రం 10 పేర్లలో లిస్ట్ విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఇందులో కీలకమైన పేర్లు ఉన్నాయి.
గతంలో ఎంపీ సీట్లకు పోటీ చేసిన పలువురికి ఈసారి అసెంబ్లీ జాబితాలో చోటు దక్కింది. అలాగే 11వ సీటును కూడా బీజేపీ తీసుకుంటుందని ప్రచారం జరిగినా అలాంటిదే లేదని తేలిపోయింది.
bjp releases 10 assembly candidates list in ap- here are details
బీజేపీ ఇవాళ విడుదల చేసిన ఏపీ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో మొత్తం 10 పేర్లు ఉన్నాయి. ఇందులో ఎచ్చెర్ల నుంచి ఎన్.ఈశ్వరరావు, విశాఖపట్నం ఉత్తర సీటు నుంచి విష్ణుకుమార్ రాజు, అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి శివకృష్ణంరాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస రావు, విజయవాడ పశ్చిమ సీటు నుంచి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి బొజ్జా రోషన్న, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి, ఆదోని నుంచి పీవీ పార్ధసారధి, ధర్మవరం నుంచి సత్యకుమార్ కు చోటు దక్కింది.
ఎన్డీయే కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా బీజేపీకి 6 లోక్ సభ సీట్లతో పాటు 10 అసెంబ్లీ సీట్లు కూడా దక్కాయి. ఇప్పటికే ఆరుగురు లోక్ సభ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ.. ఇవాళ అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఇందులో గతంలో రాజ్యసభ ఎంపీగా వ్యవహరించిన సుజనా చౌదరికి అనూహ్యంగా విజయవాడ పశ్చిమ సీటు నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ సీటు కోసం జనసేన నేత పోతిన మహేష్ ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. అలాగే వరదాపురం సూరిని కాదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు ధర్మవరం సీటు ఇచ్చారు. ఈ జాబితాలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నించినా సోము వీర్రాజుకు చోటు దక్కలేదు.