ఏపీలో పింఛన్ల పంపిణీపై క్లారిటీ వచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లు అందిస్తారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ.. సెర్ప్ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందే పింఛన్లు అందిస్తారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని ఇప్పటికే ఆదేశాలిచ్చింది. లబ్ధిదారులు ఆధార్ , ఇతర గుర్తింపు కార్డు తీసుకుని సచివాలయాలకు వెళితే అక్కడ పింఛన్ పంపిణీ చేస్తారు.
నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్ల సేవలను వినియోగించకూడదని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలతో నేపథ్యంలో సెర్ప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్ల వద్ద ఉన్న మొబైల్స్, టాబ్లెట్స్, ఇతర ప్రభుత్వ పరిపకాలను జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఈసీ ఆదేశించింది. సంక్షేమ పథకాలను ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల ద్వారా అమలు చేయాలని సూచించింది. వాలంటీర్లపై ఫిర్యాదులు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంజయ్‌కుమార్ శనివారం ఆదేశాలు ఇచ్చారు.
వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని సీఈసీ ఆదేశించింది. అయినా సరే చాలా చోట్ల వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సంక్షేమ పథకాల నగదు పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
మరోవైపు పింఛన్ల పంపిణీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాశారు. వృద్ధులు, వితంతువులతో సహా లబ్ధిదారులందరికీ నగదు రూపంలో పింఛన్ చెల్లించాలని కోరారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా పంపిణీ వేగంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పింఛన్ల నిధులను ప్రభుత్వం సిద్ధం చేయలేదని తెలుస్తోందన్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత లేఖ రాశారు.