AP

ఏపీలో రాజకీయ పార్టీలకు సీఈవో ఊరట..!

ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ సీఈవో ముకేష్ కుమార్ మీనా భారీ ఊరటనిచ్చారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికై ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సిందేనని గతంలో ఆదేశాలు ఇచ్చిన ఆయన.. ఇవాళ మాత్రం కాస్త వెసులుబాటు ఇచ్చారు. ఇంటింటి ప్రచార అనుమతి విషయంలో తగిన వివరణకై భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని, ఈ అంశంలో తగిన వివరణ అందేలోపు ముందస్తు సమాచారాన్ని సంబంధిత ఆర్వోకు, పోలీస్ స్టేషన్ కు ఇస్తే చాలన్నారు.

 

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు(కలెక్టర్లు), ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా వారికి స్పష్టంచేశారు. ఇవాళ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి హింస, రీపోలింగ్ తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలని సీఈవో అధికారులకు సూచించారు.

 

రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తుచేయాలని, వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి స్పందించాలని సూచించారు. వారిని ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. అలాగే నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని, ఇందుకు రాష్ట్రమంతా ఒకే విదానాన్ని అనుసరించేలా త్వరలో విధివిధానాలు ఇస్తామన్నారు. ఈసీ పంపిన ప్రత్యేక పరిశీలకులు సంతృప్తి చెందేలా చూసుకోవాలన్నారు.

 

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని, తమ కార్యాలయం నుండి పంపించే ఫిర్యాదులపై జిల్లా స్థాయిలోనే సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే నివేదిక పంపాలన్నారు. తదుపరి చర్యల కోసం తగు ఆదేశాలు జారీ చేయాలని తమను కోరవద్దన్నారు.