AP

జగన్‌కు షాక్.. కీలక నేత పార్టీకి గుడ్ బై ..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కొద్దికాలంగా అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న యామిని బాల వైసీపీకి గుడ్ బై చెప్పారు.

 

శింగనమల నియోజకవర్గం సీటు ఆశించిన ఆమెకు మొండిచేయి ఎదురైంది. నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జోన్నలగడ్డ పద్మవతికి సీటు నిరాకరించడంతో తనకే టికెట్ దక్కుతుందని యామిని బాల ఆశించారు. అయితే శింగనమల టికెట్‌ను ఎవరూ ఊహించని విధంగా ఓ సాధారణ డ్రైవర్‌ను అభ్యర్థిగా ప్రకటించి జగన్ సంచలనం సృష్టించారు.వచ్చే ఎన్నికల్లో శింగనమల అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరాంజనేయులును అధికార పార్టీ బరిలో దించింది. వీరాంజనేయులుకు టికెట్ ఇవ్వడంపై పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

నియోజకవర్గంలో చాలామంది పేరున్న నాయకులు ఉన్నప్పటికి వారిని దాటుకుని వీరాంజనేయులుకు ఎలా టికెట్ దక్కిందో ఎవరికి అర్థం కావడం లేదు. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. అనుచరులతో సమావేశం అయిన ఆమె తన రాజకీయ భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే యామిని బాల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. మరి రాజకీయంగా యామిని బాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.