AP

టీడీపీలో ఆ నేతలపై వైసీపీ గురి – ఆపరేషన్ షురూ..!!

ఏపీలో ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యర్ది పార్టీలపై పై చేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. టీడీపీ,బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా సీట్లు దక్కని నేతల పై వైసీపీ గురి పెట్టింది. మూడు పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను వైసీపీ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం సీఎం జగన్ సన్నిహిత నేతలు ఆపరేషన్ ప్రారంభించారు. చేరికలు మొదలయ్యాయి.

 

పొత్తులో భాగంగా సీట్లు దక్కని కూటమి పార్టీల నేతల పైన వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వారితో పాటుగా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆకర్షిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ నేతలు నోటిఫికేషన్ వచ్చే లోగా చేరికలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నేతలతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. గోదావరి జిల్లాల్లోనూ ఆపరేషన్ వేగవంతం చేసారు. తాజాగా దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైపీపీలో చేరారు.

వారిలో మూడు పార్టీల్లోనూ పలు హోదాలు నిర్వహించిన వారు ఉన్నారు. 2019 ఎన్నికల్లో దెందులూరులో వైసీపీ ఎమ్మెల్యేగా అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. తిరిగి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి తిరిగి చింతమనేని ప్రభాకర్ పోటీలో ఉన్నారు. మరోసారి విజయం సాధించే లక్ష్యంతో ఇరువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీలోకి కూటమి నేతలను ఆహ్వానించారు. ఇక, జగన్ బస్సు యాత్రం పదో రోజుకు చేరింది. ఈ రోజు జగన్ ను ప్రకాశం జిల్లా కొండెపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైయ‌స్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ నేత‌లు క‌లిశారు. ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థులు అత్య‌ధిక మెజార్టీతో గెలిచేలా ప‌నిచేయాల‌ని పార్టీ నేతలు, కార్య‌క‌ర్త‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.