మాజీ సీఎం జగన్ ను ఒక పట్టాన వదిలేటట్లు లేదు ఆయన చెల్లెలు షర్మిళ. జగన్ ను టార్గెట్ చేస్తూ ఇటీవల విమర్శలు కురిపిస్తున్న షర్మిళ, తాజాగా మరోమారు సంచలన ప్రకటన చేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సీఎం చంద్రబాబుకు షర్మిళ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో గత వైసీపీ పాలన, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని షర్మిళ కోరడం విశేషం.
ఇటీవల అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించి వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గౌతం అదానీ నుండి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో జగన్ ను టార్గెట్ చేస్తూ షర్మిళ బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది.
తాను విడుదల చేసిన లేఖలో షర్మిళ ఏమి చెప్పారంటే.. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయని, స్కీముల కోసం స్కామ్ లకు పాల్పడినట్లు ఆధారాలు సైతం ప్రభుత్వం ముందు ఉన్నాయన్నారు. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి సీఎం జగన్ నేరుగా లంచాలు తీసుకున్నట్లు అమెరికా కోర్టులో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయని ఈ సందర్భంగా షర్మిళ తెలిపారు.
అదానీతో గత ప్రభుత్వం 25 ఏళ్లకు గాని ఒప్పందం చేస్తుందని, 2021 డిసెంబర్ 1న 7వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందాలు జరిగాయని, రాష్ట్రంలో రైతుల కోసం ఈ విద్యుత్ వినియోగించనున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించుకుందన్నారు. విద్యుత్ కొనుగోలు వైసీపీ ప్రభుత్వం సాధించిన విధంగా గొప్పలు చెప్పుకున్నారని, కానీ అదానీ దగ్గర నుండి ముడుపుల కోసమే ఈ ఒప్పందం జరిగినట్లు తాను భావిస్తున్నానన్నారు.
విద్యుత్ కొనుగోలు విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలని, అలాగే 2019 నుండి 2024 మధ్య అదానీతో జరిగిన ఒప్పందాల మీద పూర్తిగా విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అదానీ కంపెనీ నుండి జగన్మోహన్ రెడ్డి వేలకోట్ల ముడుపులు తీసుకున్నారే తప్ప, ఏ ఒక్కరికి ఉద్యోగం అందించిన పాపాన పోలేదని విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దోచుకోవాలని చూసిన అదానీ గ్రూప్స్ కి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అర్హత లేదని తెలిపారు చివరగా అదానీ కంపెనీని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ కంపెనీగా పరిగణించాలని షర్మిళ డిమాండ్ చేశారు. అక్రమంగా జరిగిన ఒప్పందంతో 20 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడే భారము రూ.1.50 లక్షల కోట్లు కావున వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని ఆమె కోరారు.