AP

చంద్రబాబు అరెస్ట్ పై సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశాలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబును కేసులు వెంటాడుతున్నాయి. మద్యం కేసులో చంద్రబాబును ఏ -3గా సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పై వాదనలు ముగిశాయి. దీని పైన తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు సీఐడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.

 

మద్యం కేసులో భాగంగా చంద్రబాబు, నాటి మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పైన హైకోర్టులో వాదనలు పూర్తి కావటంతో న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. గతంలో వాదనలు పూర్తికావడంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.తీర్పు చెప్పే వరకు చంద్రబాబుపై ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టుల ఆదేశాలు జారీ చేసింది.

 

మద్యం దుకాణాల లైసెన్స్ దారులకు 2015-17 కాలంలో ప్రివిలేజ్ ఫీజు విధింపు నిబంధన తొలిగింపుకు ప్రతిపాదించిన ఫైలు నాటి సీఎం చంద్రబాబు వద్దకు రాలేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. నాటి ఎక్సైజ్ మంత్రి, కమిషనర్ స్థాయిలోనే ఆ నిర్ణయం జరిగిందని వివరించారు. ఫైలును ఆర్దిక శాఖకు పంపకపోవటాన్ని సీఐడీ ఆక్షేపించకపోవటం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలన్నారు. అందుకు అప్పటి సీఎం, మంత్రిని బాధ్యులను చేయటం సరికాదని వాదించారు. పిటీషన్ పై దురుద్దేశపూర్వకంగా కేసు నమోదు చేసారని..ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్దించారు.