AP

ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ..

ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సారధ్యంలో కొత్త పార్టీ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. జై భారత్ పేరిట ఆయన ఈరోజు సాయంత్రం జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. వచ్చే ఎన్నికల నాటికి ఏదో పార్టీలో చేరి విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగుతానని చాలా సందర్భాల్లో జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా పొలిటికల్ పార్టీ నే ఏర్పాటు చేస్తుండడం విశేషం.

 

More

From Ap politics

సిబిఐ అధికారిగా ఉన్న ఆయన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019 ఎన్నికలకు ముందు జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడతారని ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా జనసేనలో చేరి విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. సుమారు రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడాన్ని తప్పుపడుతూ జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. గత నాలుగు సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు.

 

మొన్న ఆమధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. స్టీల్ ఉద్యోగుల నిరసనల్లో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్తగా పార్టీని ప్రకటిస్తున్నారు. కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన వేదిక ఇప్పుడు పార్టీగా మారుతుందని టాక్ నడుస్తోంది. అయితే జెడి కొత్త పార్టీ ఏ పార్టీ పై ప్రభావం చూపుతుంది? ఎవరికి నష్టం చేకూరుస్తుందని చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బలమైన సామాజిక వర్గం కూటమి వైపు వెళ్తున్నట్లు స్పష్టమైంది. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడం పై రకరకాల విశ్లేషణలు కొనసాగుతున్నాయి

ముఖ్యంగా టిడిపి, జనసేన పొత్తును చాలామంది కాపులు వ్యతిరేకిస్తున్నారు. పవర్ షేరింగ్ విషయంలో టిడిపి నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో చాలామంది కాపు నాయకులు సైలెంట్ అయ్యారు. పవన్ ను ముందు పెట్టి రాజకీయాలు చేయాలనుకున్నారు. పవన్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. చాలామంది కాపు నాయకులు జనసేన ను వీడారు. ఇప్పుడు ఇదే సమయంలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. మరికొద్ది గంటల్లో విజయవాడ వేదికగా కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉంది.