విజయవాడ నుంచి గూడూరు, చెన్నై మార్గంలో కీలకంగా ఉన్న ఒంగోలు రైల్వేస్టేషన్ లో దూరప్రాంతాలకు వెళ్లే కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేదు. ప్రస్తుతం అయ్యప్పస్వామి భక్తుల సీజన్ కావడంతో కేరళవైపు వెళ్లే రైళ్లు కూడా నడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో ఎంపీ విజ్ఞప్తి మేరకు రైల్వే ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఒంగోలులో హాల్టింగ్ ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇకనుంచి ఒంగోలు స్టేషన్ లో జబల్పూర్-మధురై-జబల్పూర్ (02121-02122), తిరుపతి-జైపూర్-తిరుపతి (04717-04718) రైళ్లు నిలవబోతున్నాయి. ఈమేరకు అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.
అయ్యప్ప భక్తుల కోసం శబరిమలై వెళ్లడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబరు ఒకటోతేదీ నుంచి ఇవి పట్టాలెక్కబోతున్నాయి. మౌలాలీ – కొల్లాం – మౌలాలీ (07141/07142) రైలు సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలు, స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ బోగీలున్నాయి.
అలాగే హైదరాబాద్ – కొట్టాయం, కొట్టాయం – సికింద్రాబాద్ (07137/07138) రైలు మార్గమధ్యంలో సికింద్రాబాద్, మౌలాలీ, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
కాచిగూడ – కొట్టాయం – కాచిగూడ (07131/07132) ప్రత్యేక రైలు ఆదివారం నుంచి నడవనుంది. మార్గమధ్యంలో మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.