APCINEMAPOLITICSTELANGANA

అధికార పార్టీలకి కష్టం వస్తే ప్రజలు కన్నీళ్ళు కార్చాలా?

ఒకప్పుడు అధికార పార్టీలు రాష్ట్రాన్ని ప్రజలను ప్రభావితం చేసే వివిద అంశాలపై ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు ఓసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకొంటుండేవి.

ఇటువంటి మంచి సాంప్రదాయాన్ని దాదాపు అన్ని పార్టీలు ఎప్పుడో మర్చిపోయాయి. కనీసం రాష్ట్రానికి సంబందించిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రతిపక్షాలను కలుపుకుపోయేందుకు ప్రయత్నించడం లేదు.

కానీ అధికార పార్టీల నేతలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు లేదా హత్యనేరాలలో దర్యాప్తు సంస్థలకు అడ్డంగా దొరికిపోయినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ తమకు అండగా నిలబడాలని ఆశిస్తుంటాయి. తమ సమస్యను రాష్ట్ర సమస్య, ప్రజల సమస్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తుంటాయి.

రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని ఈడీ విచారణకు ఢిల్లీ పిలిచినప్పుడు, ఆమెను అరెస్ట్‌ చేయవచ్చని ఊహాగానాలు వినిపించినప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం, మంత్రులు, బిఆర్ఎస్ పార్టీ ఏవిదంగా వ్యవహరించిందో అందరూ చూశారు. ప్రధాని నరేంద్రమోడీ కేసీఆర్‌ని రాజకీయంగా ఎదుర్కొలేకనే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని, కానీ తెలంగాణ బిడ్డలు కేసులకు భయపడరంటూ ఫ్లెక్సీ బ్యానర్లు కూడా పెట్టుకోవడం అందరూ చూశారు.

బిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నట్లు ఒకవేళ ఇది బిఐఎస్, బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరాటమైతే దాంతో ప్రజలకు ఏం సంబంధం?రెండు రాజకీయ పార్టీల పోరులోకి ప్రజలను లాగవలసిన అవసరం ఏమిటి?అయినా ఆ కేసును ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పుకొంటున్నప్పుడు మద్యలో ప్రజల మద్దతు కోరడం దేనికి?అంటే వ్యక్తిగత లేదా పార్టీ పరమైన సమస్యను జనాంతికం చేసే ప్రయత్నమే అని అర్దం అవుతోంది.

ఏపీలో వివేకాహత్య కేసులో కూడా వైసీపీ నేతలు ఇదేవిదంగా వాదిస్తున్నారు. దీంతో తమకు ఎటువంటి సంబందమూ లేదని, చంద్రబాబు నాయుడు అంతా చేయించాచరని కోర్టులలో వాదిస్తున్నప్పటికీ, టిడిపి ప్రశ్నలకు, విమర్శలకు ధీటుగా జవాబు చెప్పకుండా మౌనం వహిస్తుండటం గమనార్హం. అయితే రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ ఈ కేసులో తమకు అండగా నిలబడాలని వైసీపీ కోరడం లేదు. కానీ అత్యవసరమైనప్పుడు సిఎం జగన్‌ ఢిల్లీ వెళ్ళివస్తున్నారు. బహుశః నేడో రేపో వెళ్ళిరావచ్చు. అది వేరే విషయం.

వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉండటంతో సిఎం జగన్‌ అత్యవసరంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డితో సహా మరికొందరు ముఖ్యనేతలతో సమావేశమయ్యి చర్చిస్తున్నారు. అంటే ఈ వ్యవహారంలో పార్టీని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు. ఇది వారి పార్టీ అంతర్గత వ్యవహారం కనుక తప్పు పట్టలేము. కానీ ఓ మంచి పని కోసం నలుగురినీ కలుపుకుపోనప్పుడు, చెడుకి మాత్రం కలుపుకుపోవాలనుకోవడమే విచిత్రం కదా?