AP

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. వచ్చే ఏడాదిలో ఫ్రీ బస్సు పథకం..?

ఏపీ కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘంగా సాగింది. తాడేపల్లిలోని సచివాలయంలో మంగళవారం కేబినెట్ సమావేశాన్ని సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యువజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలుపగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం ప్రారంభం కాని గృహాలను రద్దు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

ముందుగా కేబినెట్ భేటీలో చర్చించవలసిన అంశాల గురించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశాల గురించి సుదీర్ఘంగా కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి అక్కడ జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాను గుట్టు రట్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సైతం సీరియస్ గా కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అక్రమ రేషన్ బియ్యం రవాణాకు ఎవరు పాల్పడినా, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పోర్టు భద్రతా అంశాలపై సుధీర్ఘ చర్చ సాగగా, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొనేందుకు సంబంధిత అధికారుల ద్వారా సమాచారం పూర్తి స్థాయిలో తీసుకోవాలని కేబినెట్ సమ్మతించింది.

 

అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం ద్వారా, పేద గిరిజనులకు గృహాలు నిర్మించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహాలు మంజూరు చేయగా, నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వాటిని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

 

అంతేకాకుండా ఏపీ ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీస్ సెనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు సైతం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్ టైల్ గార్మెట్ కూడా ఆమోదం తెలిపి, ఇతర అంశాలపై సుధీర్ఘ చర్చ సాగింది. మహిళల ఫ్రీ బస్సు పథకంపై నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉంటాయని ముందుగా భావించినా, కేబినెట్ భేటీలో ఆ ప్రస్తావనే రాలేదని తెలుస్తోంది. మొత్తం మీద నూతన సంవత్సరం ఫ్రీ బస్ పై ప్రభుత్వం తగిన మార్గదర్శకాలతో అమలు చేయడం ఖాయమని ప్రచారం సాగుతోంది.